Saturday, March 30, 2019

పరీక్షలకు తయారవడం ఎలా?

Posted by: Life Skills Sankar
Source: behappy.org.in
https://openclipart.org


ఎల్‌.కె.జి. నుండి పి.జి. పూర్తయ్యేలోపు కనీసం 100 సార్లు పరీక్షలు వ్రాస్తారు.  కాని పి.జి చివరి సంవత్సరంలో కూడా కొందరు విద్యార్ధులకు పరీక్షలకు ఎలా తయారుకావాలో తెలియడం లేదు.  మంచి మార్కులు రావాలంటే విద్యార్ధు లుసంవత్సరం మొదటి నుండి ప్రణాళిక ఏర్పరచుకోవాలి. సంవత్సరం మధ్యనుండి మొదలు పెడదాంలే అనుకొంటే ఫలితం కూడా అలానే ఉంటుంది. 

నీవు, నీ స్నేహితులతో కలసి వన్‌డే క్రికెట్‌ ఆడుతున్నావనుకో. మీరు గెలవడానికి 235 పరుగులు చేయాలనుకోండి. ఆ ! ఏముందిలే, ఎదుటి వారిపై తేలిగ్గా ఆ స్కోరు చేస్తాం అని మొదటి ఇరవై ఓవర్లు సరిగా ఆడలేదనుకోండి, అందువల్ల మిగిలిన 30 ఓవర్లలో ఎక్కువ పరుగు చేయాల్సి వస్తుంది. రన్‌రేట్‌ ఎక్కువ చేయాల్సివస్తే ఆడే వాళ్ళపై వత్తిడి  పెరుగుతుంది. ఆదుర్ధా, హడావుడి పడతారు. కొన్ని వికెట్లు పడిపోవచ్చు. దాంతో మరింత టెన్షన్‌. అసలు గెలుస్తామా అన్న అనుమానం వస్తుంది. ఇదంతా మొదటి ఇరవై ఓవర్లలో శ్రద్ధ చూపక పోవడమే. మొదటి నుండి జాగ్రత్త లేకపోతే చదువైనా అంతేమరి. కాబట్టి సంవత్సరం మొదటి నుండి శ్రద్ధగా వుంటేనే మంచి మార్కులు వస్తాయి.

వ్యాసాలు నేర్చుకోవడానికి ‘కీ’ షీటు పద్ధతి

వ్యాసాలు నేర్చుకోవడానికి ‘కీ’ షీటు పద్దతి ఎంతో సులువైనది. ఒక వ్యాస ప్రశ్నకు సమాధానం నేర్చుకోవడానికి క్రింది విధంగా చెయ్యండి.

  • నిర్వచనం వ్రాయండి.
  • సైడ్‌ హెడ్డింగ్స్‌ వ్రాయండి.
  • ప్రతీ సైడ్‌ హెడ్డింగ్‌ ఎదురుగా నేర్చుకోవల్సిన ముఖ్యమైన పదాలు వ్రాసుకోండి. ఆ పదాలను చదివితే వాక్యాలు గుర్తుకురావాలి.
  • చిత్రపటాలు, పట్టికలు ఉంటే సాధన చెయ్యండి.
ఇప్పుడు నోట్స్‌ లేదా టెక్స్ట్ బుక్ మూసి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. పరీక్షల సమయంలో ఈ ‘కీ’ షీటు చదివితే సిలబస్‌ త్వరగా పూర్తవుతుంది. వ్యాసాల నుండే చిన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు గుర్తుంచుకోవచ్చు.

సమాధానాలు వ్రాయడం ఒక కళ
  • ఎంత చదివినా, ఎంత బాగా గుర్తున్నా, వ్రాసే విధానం తెలియకపోతే మంచి మార్కులు రావు. కాబట్టి క్రింది విషయాలను చదివి గుర్తుంచుకొని పాటించండి.
  • చేతివ్రాత బాగుండాలి 
  • నిర్వచనం ఉంటే యధాతధంగా వ్రాయాలి.
  • చిన్న ప్రశ్నలకు వ్రాసే సమాధానాలలో ముఖ్యమైన విషయాలు వదలకుండా వ్రాయాలి.

వ్యాస ప్రశ్నకు సమాధానాలను క్రింద సూచించిన విధంగా వ్రాయాలి.
  • జవాబులో నిర్వచనం వుంటే ముందుగా అది వ్రాయాలి.
  • Side headings పెట్టాలి. Underline  చెయ్యాలి.
  • జవాబులో ముఖ్యమైన పదాలను కూడా Underline చేయాలి.
  •  అవసరమైన చోట చిత్ర పటాలను (Figures) గీచి, భాగాలు గుర్తించి వివరించాలి.
  • పట్టికలు వుంటే వాటిని కూడా వేయాలి.
  • పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండాలి.
మీరు ఎంతబాగా చదివినా, పరీక్షలకు ఎలా తయారవ్వాలో తెలియకపోతే చాలామార్కులు నష్టపోతారు. అందుకే మీ కోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.

సంవత్సరం మొదటినుండి చివరివరకు
  • పాఠాలు శ్రద్ధగా వినాలి.
  • ఏం విన్నారో అర్ధం చేసుకోండి.
  • అర్ధంకానివి అడిగి తెలుసుకోండి.
  • ఏరోజు విన్నవి ఆరోజే చదవండి.
  • పాఠం వింటూ ముఖ్యమైన విషయాలు వ్రాసుకోండి.
  • చిత్రపటాలు, పట్టికలు నేర్చుకోండి.

ఇష్టమైన సబ్జెక్టులు
కొంతమంది విద్యార్ధులు వారికి ఇష్టమైనవి లేదా తేలిగ్గా ఉండే సబ్జెక్టులే ఎక్కువసమయం చదువుతుంటారు. అందువల్ల కొన్నిసార్లు వారికి కష్టమనిపించే సబ్జెక్టులలో ఫెయిల్‌ అవుతుంటారు లేదా తక్కువ మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి మంచి మార్కులు రావాలంటే కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.

ఇష్టపడడానికి కారణాలు
  • నేర్చుకోవడానికి తేలిగ్గా ఉండటం
  • చిన్నతనం నుండి ఒక అభిప్రాయం ఏర్పడటం
  • టీచర్‌ చక్కగా బోధించడం
  • జన్యువులు
  • టీచర్‌ అంటే ఇష్టం

ఇష్టంలేని సబ్జెక్టులు

ఒక సబ్జెక్టు పట్ల ఇష్టం లేకపోతే మార్కులు తగ్గి విద్యార్ధులు నష్టపోతారు. కాబట్టి శ్రద్ధగా వినడం, ఎక్కువ సార్లు రివిజన్‌ చెయ్యడం, చూడకుండా వ్రాయడం, అవసరమైతే ట్యూషన్‌ పెట్టించుకోవడంవల్ల మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. 

ఇష్టం లేకపోవడానికి కారణాలు
  • నేర్చుకోవడానికి కష్టంగా ఉండటం.
  • అర్థంకాక పోవడం.
  • టీచర్‌ సరిగా చెప్పకపోవడం.
  • చిన్నతనంలోనే ఒక అభిప్రాయం ఏర్పడటం.
  • టీచర్‌  అంటే ఇష్టం లేకపోవడం

పరీక్షలకు ఒక నెల ముందు
  • సబ్జెక్టున్నింటికి సమయం కేటాయించి ప్రణాళిక వేసుకోవాలి.
  • ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి.
  • కష్టమైన, ఇష్టంలేని సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి.
  • ప్రతిరోజు అవసరమైనంత నిద్ర పోవాలి.
  • ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.
  • చల్లని పదార్ధాలు తినడం, త్రాగడం చేయకండి.

పరీక్షలకు రెండు రోజుల ముందు
  • మొదటి పరీక్ష కోసమే చదవండి.
  • గతంలో చదివినంతవరకే రివిజన్‌ చెయ్యండి.
  • కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకండి.
  • సరిపోయినంత నిద్రపొండి.
  • కష్టపడి చదవడమేకాని, ఫలితం మీ చేతుల్లో లేదని గుర్తుంచుకోండి.
  • ఎప్పుడూ మనసు  సంతోషంగా ఉంచుకోండి.

పరీక్ష రోజున
  • పరీక్ష సమయానికి కనీసం గంటముందు చదవడం ఆపండి.
  • పరీక్ష వ్రాయడానికి కావలసినవి సిద్ధం చేసుకోండి.
  • స్నేహితులతో సరదాగా మాటు తప్పించి పరీక్ష గురించి చర్చించకండి.
  • పరీక్షా కేంద్రానికి కనీసం అరగంట ముందుగా చేరండి.

పరీక్ష హాలులో
  • 5 నుండి 10 ని॥లు కళ్ళు మూసుకుని  కూర్చోండి.
  • సమాధాన పత్రం ఇవ్వగానే హాల్‌టికెట్‌ నంబర్‌ స్పష్టంగా కనబడేలా వ్రాయండి. కొట్టివేతలు  
  • ఉంటే ఇన్విజిలేటరుతో సంతకం చేయించుకోండి.
  • ఇన్విజిలేటరు ఇచ్చే సూచనలు శ్రద్ధగావిని పాటించండి.
  • పరీక్షకు సంబంధించిన సబ్జెక్టు మెటీరియల్‌, ఇతరములు చిన్నముక్క కూడా దగ్గర ఉంచుకోకండి. 
  • ప్రశ్నాపత్రం పైనగాని, బెంచ్‌, పాడ్‌లపైనా ఏమీ వ్రాయకండి. తనిఖీబృందాలు మిమ్మల్ని బుక్‌ చెయ్యవచ్చు.
  • ప్రశ్నాపత్రాన్ని శ్రద్దగా చదవండి.
  • తేలికగా ఉన్న ప్రశ్నకు మొదట సమాధానం వ్రాయండి.
  • మొదటి పేజీ నెమ్మదిగా అందంగా వ్రాయండి.
  • ప్రశ్నలు  కష్టంగా అనిపిస్తే కంగారు పడొద్దు, మీకే కాదు, అందరికీ అలాగే అనిపిస్తుంది.
  • సమాధాన పత్రంలో చివరి పేజీని ‘చిత్తుగా’ వాడుకోండి.
  • సమాధానాలు వ్రాయడం అయిపోయాక ప్రశ్నల నంబర్లు సరిచూచుకోండి.
  • సమయం మిగిలితే వ్రాసింది పరిశీలించండి.

పరీక్ష హాలునుండి బయటకు వచ్చాక

స్నేహితులతో తప్పొప్పుల గురించి చర్చించకండి.
ఆహారం తీసుకొని, కొంత సమయం విశ్రాంతి తీసుకోండి.
తరువాతి పరీక్షకు ప్రిపరేషన్‌ మొదలు పెట్టండి.

పరీక్షలన్ని అయ్యాక
  • నా బాధ్యత నేను నిర్వర్తించాను, ఫలితం నా చేతుల్లో లేదనుకోవాలి.
  • మార్కులు తగ్గుతాయనిపిస్తే, దాని ప్రకారం భవిష్యత్‌ ప్రణాళిక వేసుకోవాలి.

ఫలితాలు తెలిశాక
  • వచ్చిన మార్కులను బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.
  • ఫెలయిన విద్యార్ధులు, చదువు జీవితంలో ఒక భాగమని, మంచిగా బ్రతకడానికి చాలా మార్గాులున్నాయని అర్ధం చేసుకోవాలి. అంతేకాక మరలా  వ్రాసి పాస్‌ కావచ్చని గుర్తుంచుకోవాలి.
  • జీవితంలో విజయం సాధించిన వారి చరిత్రలు చదవండి.
  • చావడం అనేది మూర్ఖులు మాత్రమే చేస్తారు. తెలివిగల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.

ఆటపాటలు ఎంతో అవసరం 

మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆటపాటలు చాలా అవసరం. ప్రతిరోజు కనీసం అరగంట నుండి గంట సేపు ఆడుకోవాలి. చదువుతోపాటు వారికిష్టమయిన ఏదో ఒకటి అంటే సంగీతం, చిత్రలేఖనం, నృత్యం లాంటివి నేర్చుకోవాలి. ఆటపాటలు, భౌతిక, మానసిక ఆరోగ్యాలను పెంపొందిస్తాయి. అందువల్ల విద్యార్ధులు ఎక్కువ శ్రమ చేయగుగుతారు. చురుకుగాను ఉంటారు.

*ప్రయత్నించు, సాధించు, విజేతవు నువ్వే*