Sunday, March 31, 2019

జీవితం విలువ ఎంత?


ఈ జీవితాన్ని ఉపయోగించుకొని కొందరు మహాత్ములయ్యారు, మరికొందరు చెడ్డవారిగా మిగిలారు, ఇంకొందరు ఏమీ చెయ్యక జీవితం ముగించారు.

ఈ కథ చదివి మీ జీవితం విలువ ఎంతో మీరే చెప్పండి.

మహేష్‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. కాలేజిలో చేరిన రెండు నెలలకే జడ పొడవుగా ఉందని నచ్చి ఒక అమ్మాయిని ప్రేమించేశాడు. ఒక మంచి రోజు చూసి ప్రొపోజ్‌ చేశాడు. కానీ ఆ అమ్మాయి '' ముందు బాగా చదువుకో, ఈ వయస్సులో ప్రేమేంటి'' అని చివాట్లు పెట్టింది. మహేష్‌ మనస్సు గాయపడింది. కాలేజీ నుండి మహేష్‌ విచారంగా ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ టిఫిన్‌, మంచినీళ్ళు తెచ్చి స్టూల్‌ మీద పెట్టి వెళ్లింది. మహేష్‌లో క్షణ క్షణానికి డిప్రెషన్‌ పెరిగిపోతోంది. గది సీలింగ్‌ వైపు చూసాడు, ఫ్యాన్‌ కనపడింది. వెంటనే లుంగీ తీసి ఫ్యాన్‌కి వేసి రెండో చివర మెడకు బిగించుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో గాలిలో ఊగుతూఉంటే స్టూలు పైన ఉన్న గ్లాసు కాలికి తగిలి క్రింద పడింది. ఆ శబ్దానికి వాళ్ళ అమ్మ పరిగెత్తుకొని వచ్చింది. కొడుకును చూసి భర్తను రమ్మని కేకలు వేసింది. ఆ కేకలకు మహేష్‌ తండ్రి పరుగెత్తుకొని వచ్చాడు. ఇద్దరూ కలిసి మహేష్‌ ను కిందికి దించి మంచంపై పడుకోబెట్టారు. పలకరించడానికి స్నేహితులు చాలా మంది వచ్చారు. విషయం ప్రిన్నిపాల్‌ కు తెలిసి, ఉదయాన్నే పరామర్శించడానికి వచ్చాడు. ఆయన్ను చూడగానే మహేష్‌ తల్లి '' మార్కులు తగ్గితే ఆత్మహత్య చేసుకోవాలా, బిడ్డని చదవమని వత్తిడి చేయకండి'' అని పెద్దగా ఏడ్చింది. ప్రిన్సిపాల్‌ తెల్ల మొఖం వేసుకొని గదిలో ఉన్న మహేష్‌ దగ్గరికి వెళ్ళి ఏంటిరా ఇదంతా అని అడిగాడు. అమ్మకు  నా ప్రేమ విషయం తెలియదు సార్‌, తెలిస్తే తిడుతుంది, మీరు చెప్పకండి అని బ్రతిమాలాడు.

''సరే, లవ్‌ మరలా సక్సెస్‌ చేసుకుందువు గానీ ముందు చదువు సక్సెస్‌ చేసుకో '' అని ప్రిన్సిపాల్‌ లేచి బయటకు రాబోయాడు. మహేష్‌ ప్రిన్సిపాల్‌ చెయ్యి గట్టిగా పట్టుకొని ''సార్‌ మీరు మా క్లాసుకు వచ్చినప్పుడు ఈ జీవితం ఎంతో విలువైనది అన్నారు, అసలు ఈ జీవితం విలువెంత సార్‌?'' అని అడిగాడు.

రాత్రి మెడకు ఉరి వేసుకొని ఊగి అలసిపోయి ఉంటావు, ఈ రోజు రెస్ట్‌ తీసుకొని రేపు కాలేజీకి వచ్చి నన్ను కలువు అప్పుడు చెప్తాను అని వెళ్లిపోయాడు.

మహేష్‌ మరునాడు ఉదయాన్నే ప్రిన్సిపాల్‌ను కలిసాడు. మరలా ఈ జీవితం విలువెంత సార్‌ అని అడిగాడు. ఆయన ఒకె ఒకె అంటూ తన బీరువానుండి ఒక రాతి ముక్కను తీసి మహేష్‌ కు ఇచ్చి దీనిని నీ బంధువులెవరైనా కొంటారేమో కనుక్కొని రేపు జాగ్రత్తగా తీసుకొనిరా అని చెప్పాడు. సరే సార్‌ అని మహేష్‌ ఆ రాత్రి నలుగురైదుగురు బంధువుల ఇండ్లకు వెళ్ళాడు. వాళ్ళు రాయిని ఎగాదిగా చూసి ఇందేంట్రా పిచ్చి రాయి తెచ్చావు అని పారవేయపోయారు. మహేష్‌ పారవేస్తే మా సార్‌ తిడతారు అని చెప్పి దాన్ని  తీసుకుని మరునాడు ప్రిన్సిపాల్‌కి జరిగింది చెప్పాడు.

ఏం బాధపడకు ఈ రోజు కూరగాయల మార్కెట్‌ కి వెళ్ళి కొంటారేమో కనుక్కోమని చెప్పాడు. తోడుగా స్నేహితులను కూడా తీసుకొని వెళ్ళమన్నాడు. మహేష్‌ అలాగే చేశాడు. మార్కెట్‌లో ఒక వ్యాపారస్తుడు ఆ రాతి ముక్కను అటూ ఇటూ తిప్పి పాలిష్‌ పెట్టిస్తే బాగుంటుందని తలచి రెండు వందల రూపాయలకు కొంటానని అన్నాడు. మరునాడు అది విన్న ప్రిన్సిపాల్‌ చివరిగా ఒక టీచర్‌ని తోడు తీసుకొని రత్న వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళమన్నాడు.

రత్నవ్యాపారస్తులు ఆ ముక్కను జాగ్రత్తగా పరీక్షచేసి 10లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మహేష్‌కు కళ్ళు తిరిగాయి. వెంటనే ప్రిన్సిపాల్‌ను కలుద్దామని టీచర్‌ను అర్ధించాడు. టీచర్‌ మహేష్‌ని రాత్రి 9 గం||ల సమయంలో ప్రిన్సిపాల్‌ వద్దకు తీసుకొని వెళ్ళాడు.

మహేష్‌ ప్రిన్సిపాల్‌తో, సార్‌ ఈ రాయి ద్వారా నాకేమి చెప్పాలనుకుంటున్నారని అడిగాడు.  ప్రిన్సిపాల్‌ అతని భుజంపై చెయ్యివేసి 'జీవితం విలువ ఎంతని అడిగావు' ఇదంతా నీకు అర్థం కావాలనే  చేశాను అని ఇలా వివరించాడు.

మనుషుల్లో మూడు రకాలు ఉంటారు.

మొదటి రకం:

నీ బంధువులు ఈ రాయి ఎందుకూ పనికిరాదని విసరివేసారు. అలాగే జీవితానికి విలువ  లేదని అనుకునే వాళ్ళు కూడా వారి జీవితాలను వృధా చేసుకుంటారు.

రెండవ రకం: 


వీళ్ళు కూరగాయల వ్యాపారిలా ఈ జీవితానికి కొంత విలువ ఉందనుకొనే వాళ్ళు ఏదో ఉద్యోగం లేదా పని చేసి నాలుగు డబ్బులు సంపాదించడం, పెళ్ళి, పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు ... చచ్చిపోవడంతో జీవితం ముగుస్తుంది.

మూడవ రకం: 

వీళ్ళు రత్న వ్యాపారి రత్నాన్ని గుర్తించినట్లు జీవితం విలువను పూర్తిగా గుర్తించినవారు. ఉహ తెలిసినప్పటి నుండి కష్టపడి, నీతి, నిజాయితీలతో జీవితాన్ని గడిపేవాళ్ళు చివరికి మహాత్ములుగా, సమాజానికి మార్గదర్శకులుగా మిగులుతారు.


- మరి మీ జీవితం విలువ ఎంత?-


పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in