Saturday, April 24, 2021

ఆక్సిజన్ - భావోద్వేగాలతో సంబంధం

 మంచిగా జీవించే వారికి ఆక్సిజన్ కొరత ఉండదు!

భావోద్వేగాలతో సంబంధం

మానసిక ఒత్తిడికి గురవుతున్న మనుషుల్లో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది.

ప్రతికూల భావోద్వేగాలు ఉండేవారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువలన అనుకూల భావోద్వేగాలు ఉండేవారిలో కన్నా ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది.

పరీక్షల ఒత్తిడికి గురయ్యే విద్యార్దుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇతరులతో తరచు వాదనలు పెట్టుకునేవారిలో శరీరం యొక్క శక్తి తగ్గిపోతోందని గమనించారు.

ఎవరికైతే ఇతరుల పట్ల తాను పొందిన మేలు కృతజ్ఞతాభావం ఉంటుందో, వారిలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని, కణజాలల్లో కూడా ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

ఏడ్చినప్పుడు మనుషులకు కొంత రిలీఫ్ వస్తుంది. దానికి కారణం కన్నీటి ద్వారా ఒత్తిడి కలిగించే హార్మోనులు శరీరం నుంచి బయటకు వెళ్తాయి.

కృతజ్ఞత కలిగి ఉండే వారిలో ఆరోగ్యం త్వరగా చక్కబడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఒక హాస్యరస సన్నివేశం చూస్తే బీటా ఎండార్ఫిన్లు విడుదలై మనసును సంతోషంగా ఉంచటంతో పాటు, శరీరంలో పాడయిన కణాలను బాగు చేస్తాయి. గుండెపోటు ప్రమాదం తక్కువ ఉంటుంది.

ధ్యానం చేసేవాళ్ళు శ్వాసని క్రమబద్ధంగానూ, మరియు ఎక్కువ సమయం తీసుకుంటారు. అందువల్ల ఎక్కువ ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. అదే దిగులు పడేవారిలో గాలి పీల్చి వదిలే సమయం తక్కువ. కోపంగా ఉన్నప్పుడు శ్వాస ఎక్కువ వేగంతో జరుగుతుంది. అందువల్ల శరీరానికి తక్కువ ఆక్సిజన్ అందుతుంది.

కాబట్టి పాజిటివ్ భావోద్వేగాలతో జీవిస్తే ఆరోగ్యం బాగుంటుందని అదే నెగెటివ్ భావోద్వేగాలతో గడిపితే ఆరోగ్యం పాడవుతుందని గుర్తుంచుకోవాలి.

ఆచార్య  శంకర పిచ్చయ్య పొదిల       డాక్టర్ నాజియా సుల్తానా 

 

మంచిగా జీవించే వారికి ఆక్సిజన్ కొరత ఉండదు!

 

మంచిగా జీవించే వారికి ఆక్సిజన్ కొరత ఉండదు!

ఆక్సిజన్ మనం లోపలికి తీసుకునే శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి మన ప్రాణాలను కాపాడుతోంది, కాబట్టే దానిని ప్రాణవాయువు అన్నారు.

అలాంటి ఆక్సిజన్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మన శరీరంలో ఆక్సిజన్ 65%, కార్బన్ 18%, హైడ్రోజన్ 10% ఉంటాయి. మిగిలిన మూలకాలన్నీ కలిసి సుమారుగా ఒక 12% ఉంటాయి.

మన చుట్టూ ఉన్న వాతావరణంలో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, మిగిలినవన్నీ కలసి ఒక్క శాతం ఉంటాయి. మనిషి రోజుకు 17 వేల నుండి 23 వేల సార్లు శ్వాస తీసుకుంటాడు. రోజుకు 11 వేల లీటర్ల గాలి పీల్చుకుంటాడు.

మనం ప్రతిరోజు 550 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాము. వ్యాయామం చేసే వారికి  ఇంకా ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది.

ఒక్కసారి గాలి పీలిస్తే, అందులో క్విన్టిల్లియన్ ఆక్సిజన్ అణువులు ఉంటాయి(లక్ష కోట్ల కోట్లు). మనకు శక్తినిచ్చే గ్లూకోజ్, శక్తిగా మారడానికి ఆక్సిజన్ అవసరం.

ఆక్సిజన్ మన శరీరంలోని కణాలు జీవించి ఉండడానికి, పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ కణాలకు చేరుతుంది. దీనికి కారణం హిమోగ్లోబిన్, ఆక్సిజన్ రెంటికి అయస్కాంత శక్తి ఉండటమే.

మెదడుకు నాలుగు నిమిషాలు ఆక్సిజన్ అందకపొతే కణాలు చనిపోవడం మొదలవుతుంది. మనం పీల్చే గాలిలో నైట్రోజన్ వాయువు 78% ఉన్నప్పటికీ, అది మన రక్తంలో కలవదు.

మనం పీల్చే గాలిలో 21 శాతం ఆక్సిజన్ ఉంటే, వదిలే గాలిలో సుమారుగా 16 శాతం ఉంటుంది. ఇంకా మనం పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ 0.4 శాతం ఉంటే, వదిలే గాలిలో 4.4 శాతం ఉంటుంది. పీల్చే గాలిలో కన్నా మనం విడిచిపెట్టే గాలిలో ఆక్సిజన్ సుమారుగా 5% తక్కువ ఉంటుంది, ఇది కార్బన్ డైయాక్సైడ్ ఏర్పడటానికి ఉపయోగపడుతుంది.

మన శరీరంలో ఆక్సిజన్ స్థాయి గురించి తెలుసుకుందాం.

ఆరోగ్యంగా ఉండే మనుషుల్లో ఆక్సిజన్ 94% నుండి 98% వరకు ఉంటుంది.

గాలిలో ఆక్సిజన్ 19.5% నుండి 23.5% ఉన్నంతవరకు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికన్నా తక్కువ ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

ఒకవేళ గాలిలో ఆక్సిజన్ శాతం 24 శాతానికి మించి ఉందనుకోండి. దానివల్ల మంటలు చెలరేగడం, పేలుళ్లు సంభవించటం జరుగుతుంది (మిగిలినది రేపు).

ఆచార్య  శంకర పిచ్చయ్య పొదిల             డాక్టర్ నాజియా సుల్తానా